Monday, February 2, 2009

తెనాలి రామలింగడి ఎదురు దెబ్బ


తెనాలి రామలింగడి గురించి మన అందరికీ తెలిసిందే.ఆయన వికట కవిత్వపు దెబ్బకి పెద్దన లాంటి పెద్దలే అబ్బా అనకతప్పలేదు.అటువంటి రామలింగణ్ణే అభాసుపాలు చేయబోయాడు ఒకనాడు ధూర్జటి కవీశుడు.


ఒకనాడు ముక్కు తిమ్మన ఇంట్లో ఎదో శివ పూజకు అష్ట దిగ్గజాల్లో శివ భక్తులందరూ వెళ్ళారు.పూజానంతర తీర్ధ ప్రసాదాలు స్వీకరించారంతా.వారి గౌరవార్ధం ఇచ్చిన విందు భోంచేసి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.భుక్తాయాసం వల్ల రామలింగడూ,ధూర్జటీ తిమ్మన గారి ఇంట్లోనే ఉండిపోయారు.తాంబూలాలు వేసుకుంటూ రామలింగని వేళాకోళాల్లొ తడిసి ముద్దౌతున్నారు.

తిమ్మన గారు ఉయ్యాల బల్లలో ఉయ్యాల ఊగుతున్నాడు.ధూర్జటీ,రామలింగడూ నేలపై వేసిన పట్టు పరుపు మీద కూర్చున్నారు.ఈ లోపు రామలింగడు తిమ్మనతో

"మామా ఊతునా(ఊపనా)"అన్నాడు

ఉయ్యాల ఊపుతాడు కాబోలునని "సరే"నన్నడు తిమ్మన.ఊతునా అన్న మాటకి ఉయ్యనా అన్న అర్ధం తీసి వికట కవి వర్యుడు నోట్లో ఉన్న తాంబూలం తిమ్మన కాలిపై తుపుక్కున ఊశాడు నవ్వుతూ.అసహ్యకర హఠాత్పరిణామానికి తిమ్మన కాలు విసురుగా అప్రమేయతతో లేచింది.అది బలంగా రామలింగడి మూతికి తగిలి ముందు పన్ను రాలి పడింది.జరిగినదానికి రామలింగడు లెక్కపెట్టక నవ్వుతున్నా,ధూర్జటీ,తిమ్మన చాలా బాధపడ్డారు.ముఖ్యంగా తిమ్మన శివ పూజార్ధియై వచ్చిన వాడి రక్తం కళ్ళ చూసానే అని ఎంతో బాధ పడ్డడు. తర్వాత రోజే రామలింగడు దుప్పి కొమ్ము పన్నులా కోయించి ఖాళీ ఐన పన్ను స్థానంలో ఇరికించాడు.అది ఎంతగా ఇమిడిపోయిందంటే ధూర్జటే నమ్మలేకపోయాడు.

************

తరువాత రోజు భువన విజయంలో "నక్కీరుని కథలో శివుని పద్యం దోష భరితమా కాదా?'అన్న విషయంపై రసవత్కరమైన చరచ జరిగింది ఆ సభలో ధూర్జటి అమోఘంగా ఉపన్యసించాడు.పెద్దనాదులు,తమిళ,కన్నడ కవివర్యులు ధూర్జటిని పొగడ్తలతో ముంచెత్తారు.

ఇది రామలింగడికి అంత రుచించలేదు.ప్రతిభా వ్యుత్పత్తి సాధనల్లో తనకు సాటి రాలేని వేశ్యా లోలత్వాన్ని అదుపులో పెట్టుకోని ధూర్జటికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం అతనికి నచ్చలేదు.


రాయల వారు ప్రసంగిస్తూ ధూర్జటిని ఎంతగానో పొగిడి "రవి గాననిచో కవి గాంచునే కదా" అన్న సమస్యనిచ్చి పూరించమన్నారు.పెద్దనాదుల తరువాత రామలింగడు ధూర్జటిని చాయా మాత్రంగా వేళాకోళం చేస్తూ పద్యం పూరించాడు.
దాంతో కోపమొచ్చి ధూర్జటి ఆ సమస్యను ఇలా పూరించాడు

ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసినోటికిన్
నేరడు రామలింగకవి నేరిచెపో మన ముక్కుతిమ్మరాట్
కౄర పదాహతిం తెగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము ప

ల్గా రచియించినాడు రవి గాననిచో కవి గాంచునే కదా

భావం: పూర్వం దక్ష యాగం ధ్వంసం చేసేటప్పుడు వీరభద్రుని కాలి దెబ్బలకు పళ్ళు ఊడినా రవి బోసి నోటితో కాలం గడిపేస్తున్నాడు.కాని మన రామలింగ కవి ముక్కు తిమ్మన కాలు తగిలి ఊడిన పన్నుకు బదులు దుప్పికొమ్ము పలుకు పెట్టుకున్నాడు.కనుక రవి కాననిచో కవి కాన్చును.
పద్యం పూర్తి కాగానే సభలో అందరూ రామలింగడి పలువరుస చూస్తూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు.రహస్యం ఇలా బట్టబయలైనందున కోపంగా ఉన్నా చేసేదేం లేక.తనూ వాళ్ళందరితో పాటూ నవ్వాడు.
రాయల వారి ప్రియ సఖి,చిన్న భార్య చిన్నాదేవి సభకు ఆనుకొని ఏర్పాటు చేసిన మందిరంలో ఉంటూ ఇదంతా వింటూ పద్యానికి పరమానంద భరితయై తన కంఠ హారం ధూర్జటికి బహుమతిగా పంపింది,రాయల వారు ముందు ఉపన్యాసంతో,తరువాత చమత్కారభరితమైన చాటువుతో అలరించిన ధూర్జటి పాండిత్యానికి,కవిత్వానికి ముగ్ధుడై

"స్తుతి మతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గేనో
అతులిత మాధురీ మహిమ?
అంటూ ఈ ధూర్జటి కవిత్వానికి ఇంత తియ్యదనం ఎలా వచ్చిందని సభికుల్ని అడిగాడు.ఆ సమస్యను అవకాశంగా తీసుకుని రామలింగడు ఇలా పూరించాడు
హా తెలిసెన్ భువనైక మోహనో
ద్దత సుకుమార వార వనితా జనితా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటం జుమీ"
అంటూ ధూర్జటి మాటలకు ఆ తియ్యదనం భువన మొహములైన వేశ్యల పెదవులు జుర్రుకోవడం వల్ల అని పూర్తి చేసి ధూర్జటి పరువు తీసాడు.ఈ పద్యానికి మెచ్చి రాయల వారి పట్టమహిషి తిరుమల దేవి(చిన్నా దేవికి పోటీగా కావచ్చు) తన కంఠ హారం బహుమతిగా రామలింగడికి సేవకురాలితో పంపించింది.

ఇంతకీ పై రెండు చాటువుల్లో ఏది గొప్పది అనే విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి.కానీ మహా పండితులే తేల్చ లేక వదిలేసారంటారు.నా మటుకు నాకు రామలింగడి చాటువు ఎక్కువ నచ్చుతుంది.

మీకు ఏది నచ్చింది?