Friday, June 11, 2010

భారత రామాయణాలపై సినీ విషం

"దుశ్శాసనా...! నువ్వు ఈ పాండవులతో పాటూ ద్రౌపదీ దేవి ధరించిన వస్త్రాలు విప్పెయ్యి"..
మహాభారతంలో అత్యంత ఘోర అకృత్యానికి విషబీజాల్లాంటి మాటలివి.ఈ ఆఙ్ఞ ఇచ్చింది సాక్షాత్తూ దానవీరశూరుడనుకునే కర్ణుడు.
మరి ఇదేనా శూరత్వం ఇదేనా వీరత్వం.కర్ణుడికి గొప్పదనం ఆపాదించే వారికి మహాభారతానికి హృదయం లాంటి ఘట్టంలో అతని నైచ్యం కనిపించలేదా..? లేక వారి దృష్టిలో బలాత్కారాలు చేయించే వారే మహానుభావులా..?
"మంత్రీశ్వరా ఎంత వెర్రి వాడయ్యా...!చేతికి చిక్కిన సీతని ఊరికే వదిలేందుకు నేనేం మూర్ఖుడిని అనుకున్నావా?పూర్వం బ్రహ్మ మానస పుత్రిక ఒకతెను నేను బలవంతంగా అనుభవించాను.అందుకు అది బ్రహ్మచే ఏ స్త్రీనైనా బలవంతంగా అనుభవిస్తే తక్షణమే మరణిస్తానని శాపమిచ్చేలా చేసింది.అందుకే సీతను నయానో భయానో ఒప్పించాల్సి వస్తోంది". ఈ మాటలు సీతను ఎందుకు బతిమాలుకుంటావు వెళ్ళి కుక్కుట వృత్తితో(కోడి పెట్ట పుంజును అనుభవించినట్టుగా) బలాత్కరించి అనుభవించమని సలహా ఇచ్చిన మంత్రితో రావణుడు అన్నవి.
"కలిసి కాపురం చేసిన భార్యను అనుమానించిన రాముడు గొప్పవాడా..?ఆర్నెల్లు తనవద్దనే ఉన్నా సీతను తాకని రావణుడు గొప్పవాడా..?"లాంటి డైలాగులు రాసిన వాళ్ళూ ఆ పాయింట్ మీద సినిమాలు తీసిన వాళ్లూ సీతను తాకకపోవడానికి రావణుడి నైతికత కారణం కాదు..కేవలం బలాత్కరిస్తే చస్తాడని శాపం కారణమని తెలియదా?రావణుణ్ణి హీరోని చేసేసేముందు పై వాక్యం చదివే(లేదా చదివించుకునే) ఓపికా తీరికా లేకపోయాయా?
పై రెండూ మన సినిమాలు భారత రామాయణ పాత్రలను ఎలా ఇష్టం వచ్చినట్టు మార్చేశాయో...ఎంతగా ఆ ఇతిహాసాలపై విషం కక్కాయో తెలిపేందుకు చిన్న ఉదాహరణలు.ఎందుకు అలా చేస్తున్నారన్నది ఆలోచించాల్సిన విషయం.
మహాదాతలైనా...మహావీరులైనా...మహాభక్తులైనా..ధర్మం తప్పితే ఎలా పతనమిపోతారో చెప్పే పాఠాలు రావణ,కర్ణ పాత్రలు. రావణుడు శివ దర్శనానికి వెళ్లగా నంది అడ్డుకుంటుంది.కైలాస గిరిని పెకలించబోయి భంగపడి పేగులతో రుద్రవీణ వాయించి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు.అందుకు ఆగ్రహించి నంది శపిస్తుంది.ఇది రావణ స్వభావం.
నంది(వృషభం) ధర్మ స్వరూపం.ధర్మాన్ని అతిక్రమించిన వాడి భక్తి ప్రమాదకరమని సంకేతం అది.శివలింగాన్ని దర్శించేందుకు నంది అనుమతి తీసుకోవాలి...నంది కొమ్ముల్లోంచి శివ దర్శనం చేసుకోవాలి అనే ఆచారాల్లో అదే ధర్మ సూక్ష్మం ప్రతిఫలిస్తుంది.
అదంతా వేరే విషయం లెండి ఇంతకీ విషయానికి వస్తే,ఇలాంటి సూక్ష్మాల్ని రావణునికీ,కర్ణునికీ లేని గొప్పను ఆపాదించి మనకు దూరం చేసారు సినిమహానీయులు.
గతంలో మన తాతముత్తాతలందరికీ సంస్కృత వాఙ్మయమో,ఆంధ్రానువాదమో,హరికథలో,వీధి భాగోతాలో,యక్ష గానాలో,స్త్రీల పాటలో వారివారి అభిరుచి స్థాయిని బట్టీ రామాయణ భారత భాగవతాల ద్వారా వేద స్ఫూర్తితో ధర్మాం అర్ధం కామం మోక్షం ఎలా సాధించాలో చెప్పేవి.వేద వాఙ్మయం నుండి స్త్రీల పాటల వరకు ఒకే సంస్కృతి ధార ప్రవహించేది.
ఆ వినోదాలు బతికుంటే ఈ తప్పుడు ప్రచారాలు వాటిని గమనిచలేని దౌర్భాగ్యం ఉండేది కాదు.చెక్క భజనలూ,కోలాటాలూ,వీధి భాగోతాలూ,హరికథలూ,సప్తాహాలూ తర్వాత తర్వాత వచ్చిన నాటకాల్నీ మొత్తంగా సినిమాలు మింగి త్రేంచేసాయి.అమ్మలాంటి సంస్కృతికి మనల్ని దూరంచేసింది సినిమా.అదే సినిమా ఇలా రాక్షసుల్నీ నీచుల్నీ మహానుభావులుగా చెప్తూ గన్నేరుపప్పు కూర చేసి గోరుముద్దలు పెడుతోంది మనకు.
నిజానికి రామాయణ భారతాదులు మనకు పరిచయం చెయాల్సినది అమ్మ..ఆ పరిచయాన్ని విస్తృత పరచాల్సింది గురువు..లోతుపాతుల్లోకి నడపాల్సింది గ్రంధపఠనమో కథా కాలక్షేపమో అంతే గానీ విశ్వ విఖ్యాత సినీ రాకాసులు కాదు.
ఈనాటి దౌర్భాగ్యానికి కారణం మనకు మూలాలు అవగాహన లేకపోవడం.సంస్కృతం వచ్చిన వాళ్లతో వ్యాసవాల్మీకి విరచితాలు చెప్పించుకోండి...కవిత్రయాదుల తెలుగు అనువాదాలు చదువుకోండి...కనీసం తేట తెలుగులో శిరోమణి"రామాయణం",ఉషశ్రీ"భారతం" చదవండి. ఆ తర్వాతే విషవృక్షం చదివినా దానవీరశూర కర్ణ చూసినా.