Friday, June 11, 2010

భారత రామాయణాలపై సినీ విషం

"దుశ్శాసనా...! నువ్వు ఈ పాండవులతో పాటూ ద్రౌపదీ దేవి ధరించిన వస్త్రాలు విప్పెయ్యి"..
మహాభారతంలో అత్యంత ఘోర అకృత్యానికి విషబీజాల్లాంటి మాటలివి.ఈ ఆఙ్ఞ ఇచ్చింది సాక్షాత్తూ దానవీరశూరుడనుకునే కర్ణుడు.
మరి ఇదేనా శూరత్వం ఇదేనా వీరత్వం.కర్ణుడికి గొప్పదనం ఆపాదించే వారికి మహాభారతానికి హృదయం లాంటి ఘట్టంలో అతని నైచ్యం కనిపించలేదా..? లేక వారి దృష్టిలో బలాత్కారాలు చేయించే వారే మహానుభావులా..?
"మంత్రీశ్వరా ఎంత వెర్రి వాడయ్యా...!చేతికి చిక్కిన సీతని ఊరికే వదిలేందుకు నేనేం మూర్ఖుడిని అనుకున్నావా?పూర్వం బ్రహ్మ మానస పుత్రిక ఒకతెను నేను బలవంతంగా అనుభవించాను.అందుకు అది బ్రహ్మచే ఏ స్త్రీనైనా బలవంతంగా అనుభవిస్తే తక్షణమే మరణిస్తానని శాపమిచ్చేలా చేసింది.అందుకే సీతను నయానో భయానో ఒప్పించాల్సి వస్తోంది". ఈ మాటలు సీతను ఎందుకు బతిమాలుకుంటావు వెళ్ళి కుక్కుట వృత్తితో(కోడి పెట్ట పుంజును అనుభవించినట్టుగా) బలాత్కరించి అనుభవించమని సలహా ఇచ్చిన మంత్రితో రావణుడు అన్నవి.
"కలిసి కాపురం చేసిన భార్యను అనుమానించిన రాముడు గొప్పవాడా..?ఆర్నెల్లు తనవద్దనే ఉన్నా సీతను తాకని రావణుడు గొప్పవాడా..?"లాంటి డైలాగులు రాసిన వాళ్ళూ ఆ పాయింట్ మీద సినిమాలు తీసిన వాళ్లూ సీతను తాకకపోవడానికి రావణుడి నైతికత కారణం కాదు..కేవలం బలాత్కరిస్తే చస్తాడని శాపం కారణమని తెలియదా?రావణుణ్ణి హీరోని చేసేసేముందు పై వాక్యం చదివే(లేదా చదివించుకునే) ఓపికా తీరికా లేకపోయాయా?
పై రెండూ మన సినిమాలు భారత రామాయణ పాత్రలను ఎలా ఇష్టం వచ్చినట్టు మార్చేశాయో...ఎంతగా ఆ ఇతిహాసాలపై విషం కక్కాయో తెలిపేందుకు చిన్న ఉదాహరణలు.ఎందుకు అలా చేస్తున్నారన్నది ఆలోచించాల్సిన విషయం.
మహాదాతలైనా...మహావీరులైనా...మహాభక్తులైనా..ధర్మం తప్పితే ఎలా పతనమిపోతారో చెప్పే పాఠాలు రావణ,కర్ణ పాత్రలు. రావణుడు శివ దర్శనానికి వెళ్లగా నంది అడ్డుకుంటుంది.కైలాస గిరిని పెకలించబోయి భంగపడి పేగులతో రుద్రవీణ వాయించి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు.అందుకు ఆగ్రహించి నంది శపిస్తుంది.ఇది రావణ స్వభావం.
నంది(వృషభం) ధర్మ స్వరూపం.ధర్మాన్ని అతిక్రమించిన వాడి భక్తి ప్రమాదకరమని సంకేతం అది.శివలింగాన్ని దర్శించేందుకు నంది అనుమతి తీసుకోవాలి...నంది కొమ్ముల్లోంచి శివ దర్శనం చేసుకోవాలి అనే ఆచారాల్లో అదే ధర్మ సూక్ష్మం ప్రతిఫలిస్తుంది.
అదంతా వేరే విషయం లెండి ఇంతకీ విషయానికి వస్తే,ఇలాంటి సూక్ష్మాల్ని రావణునికీ,కర్ణునికీ లేని గొప్పను ఆపాదించి మనకు దూరం చేసారు సినిమహానీయులు.
గతంలో మన తాతముత్తాతలందరికీ సంస్కృత వాఙ్మయమో,ఆంధ్రానువాదమో,హరికథలో,వీధి భాగోతాలో,యక్ష గానాలో,స్త్రీల పాటలో వారివారి అభిరుచి స్థాయిని బట్టీ రామాయణ భారత భాగవతాల ద్వారా వేద స్ఫూర్తితో ధర్మాం అర్ధం కామం మోక్షం ఎలా సాధించాలో చెప్పేవి.వేద వాఙ్మయం నుండి స్త్రీల పాటల వరకు ఒకే సంస్కృతి ధార ప్రవహించేది.
ఆ వినోదాలు బతికుంటే ఈ తప్పుడు ప్రచారాలు వాటిని గమనిచలేని దౌర్భాగ్యం ఉండేది కాదు.చెక్క భజనలూ,కోలాటాలూ,వీధి భాగోతాలూ,హరికథలూ,సప్తాహాలూ తర్వాత తర్వాత వచ్చిన నాటకాల్నీ మొత్తంగా సినిమాలు మింగి త్రేంచేసాయి.అమ్మలాంటి సంస్కృతికి మనల్ని దూరంచేసింది సినిమా.అదే సినిమా ఇలా రాక్షసుల్నీ నీచుల్నీ మహానుభావులుగా చెప్తూ గన్నేరుపప్పు కూర చేసి గోరుముద్దలు పెడుతోంది మనకు.
నిజానికి రామాయణ భారతాదులు మనకు పరిచయం చెయాల్సినది అమ్మ..ఆ పరిచయాన్ని విస్తృత పరచాల్సింది గురువు..లోతుపాతుల్లోకి నడపాల్సింది గ్రంధపఠనమో కథా కాలక్షేపమో అంతే గానీ విశ్వ విఖ్యాత సినీ రాకాసులు కాదు.
ఈనాటి దౌర్భాగ్యానికి కారణం మనకు మూలాలు అవగాహన లేకపోవడం.సంస్కృతం వచ్చిన వాళ్లతో వ్యాసవాల్మీకి విరచితాలు చెప్పించుకోండి...కవిత్రయాదుల తెలుగు అనువాదాలు చదువుకోండి...కనీసం తేట తెలుగులో శిరోమణి"రామాయణం",ఉషశ్రీ"భారతం" చదవండి. ఆ తర్వాతే విషవృక్షం చదివినా దానవీరశూర కర్ణ చూసినా.

23 comments:

Sandeep P said...

చక్కని వ్యాసం రచించారండి. నిప్పులు చెరిగారు. మీకు నా మనఃపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

"గురువు చెప్తే విని నేర్చుకుంటాను. నాకు సందేహాలు ఉంటే వినమ్రంగా అడిగి తెలుసుకుంటాను" అనే మన సంస్కృతిలో "ఇంకోడి మాట వినకు. నీ మనసునే నువ్వు విను" అనే సంస్కృతి కలిసి అటూ ఇటూ కాకుండాపోయి, "ఏది మాట్లాడితే ప్రజలు నాకేదో తెలుసును, పెట్టెబయట (out-of-box) ఆలోచిస్తున్నాను అనుకుంటారో అదే మాట్లాడతాను" అనుకుంటున్నారు చాలామంది. పచ్చని పైరు లాంటి మన సంస్కృతి ఇప్పుడు బంజరభూమిలాగా తయారయ్యింది. కర్ణుడికైనా, భీష్ముడికైన, కుంభకర్ణుడికైనా - ఎవరికైనా అధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటే పతనం తప్పదు అన్నది మన కావ్యాల నీతి. దాన్ని తిమ్మిని బమ్మెను చేసి చూపడం కొంతవరకు పడమరదేశాల వారి ప్రతిభ ఐతే, కొంతవరకు మనవాళ్ళే మెప్పు కోసం చేసే తప్పు ప్రయత్నం.

ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. తప్పుగా అనుకోకండి. కర్ణుడు తప్పు చేశాడన్న మాట వాస్తవమే కానీ, ఆయనలో గొప్పదనం వేరే ఉంది. కృష్ణుడు "నువ్వు ధర్మరాజుకు అన్నవని తెలిస్తే రాజ్యం నీదవుతుంది, ద్రౌపది నీకు సతి అవుతుంది, పాండవులూ కౌరవులూ ఇద్దరూ నీకు పాదసేవ చేస్తారయ్యా!" అంటే, "కృష్ణా, ధర్మరాజు నాకు ఈ రాజ్యాన్ని ఇస్తే, స్నేహధర్మానుసారం అది నేను దుర్యోధనుడికి ఇచ్చేస్తాను. అటువంటి హీనుడు రాజ్యం ఏలడం తగదు. వాడు మట్టికొట్టుకుపోవాలంటే నేను వాడి జట్టులో ఉండితీరాలి. వాడు నన్ను నమ్ముకునే ఈ యుద్ధాన్ని తలబెట్టాడు", అని చెప్పి ధర్మరక్షణార్థం మృత్యువుని స్వయంగా ఆహ్వానించుకున్నాడు.

http://www.mahabharataonline.com/translation/mahabharata_05146.php

Varunudu said...

బాగా వ్రాసారు. మిడి మిడి జ్ఙానం తో ఈ మధ్య ప్రతీ ఒకరికీ భారత, రామాయణాలను తప్పు బట్టడం ఫ్యాషన్ అయ్యింది. రావణుడిని, దుర్యోధనుడిని హీరో చేస్తే గానీ నిద్ర పట్టని ఇలాంటి చెత్త సినిమాల వల్ల ఎన్ని మెదళ్ళు కలుషితమౌతాయో చెప్పడానికి ఉదాహరణ దాన వీర శూర కర్ణ.. ! దుర్యోధనుడిని హీరో చెయ్యడానికి ఆ పాత్ర కొరకు ప్రత్యేకంగా రామరావ్ గారు డైలాగులు వ్రాయించారట..! దాన వీర శూర కర్ణ చూసిన తర్వాత పాండవులు ఎంత అధములు అనే భావన రాకుండా ఉండడం చాలా కష్టం.. మచ్చుకి ఒక సన్నివేశం ..! "అశ్వథ్థామా హతః కుంజరః" అని ధర్మజుడు అనడానికి ముందు శ్రీ కృష్ణుడి డైలాగ్ వినండి .. ధర్మజుడికి - అధర్మం చెయ్యడమే అలవాటు ఐనట్టుగా వ్యంగ్యంగా కృష్ణుడు చెప్పే సన్నివేశం చూస్తే చాలా బాధ కలుగుతుంది.. అసత్యం ఆడడానికి ధర్మజుడు పడే వేదన ఎక్కడా చూపలేదు ఆ సినిమాలో.. ఇలాంటి సినిమాల వల్ల తల్లి లాటి సంస్కృతికి ఎంత అన్యాయం చేసిన వాళ్ళం ఔతామో తెలీసీ ఆ తప్పు చెయ్యడం క్షమార్హమైన నేరం కాదు.

Sandeep P said...

అన్నట్టు చెప్పడం మరిచాను. ఇటీవల రాఘవేంద్ర రావు, భారవి కలిసి తెలుగుసంస్కృతిని/చరిత్రని భ్రష్టు పట్టించడంలో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఉదాహరణలు:

- అన్నమయ్య చిత్రంలో సాళ్వ నరసింహరాజుని ఒక పనికిరాని వాడిలాగా, స్వార్థపరుడిలాగా చిత్రీకరించారు. నిజానికి ఆయన అన్నమయ్య పాటలను పోషించిన మహానుభావుడని వేటూరిగారి "కొమ్మకొమ్మకో సన్నాయి"లో చదివాను.
- రామదాసు చిత్రంలో రామదాసు, కబీర్దాసు కలిసి పాడినట్టు చూపించారు. నిజానికి వారిద్దరి మధ్యనా రెండు తరాలకు పైగా దూరం ఉంది. ఇంకా నయం, రామదాసు, ఏసుదాసు కలిసి రాముడు, క్రీస్తు మీద పాడారు అని చెప్పలేదు.
- శివుడు లెంపలేసుకుంటే నందికి చెంపలు వాచాయిట, శివుడికి బోరుకొట్టి సరదాగా భూలోకానికి వచ్చి అమ్మవారితో ఫోక్ డాన్సు చేశాడట. కొంచం సందర్భమైనా మంచిది సృష్టించడం చేతకాదాయే! వీరందరూ మన సంస్కృతిని, చరిత్రని ఉద్ధరించేవాళ్ళు.
- ఇక పాండురంగమహత్మ్యం పాతదానికి, కొత్త పాండురంగడికీ ఎంత భేదముందో చెప్పక్కరలేదు. రంగడి కోసం పాత సినిమా, హంగులకోసం కొత్త సినిమా. సినిమాలో భక్తికి కళ్ళల్లోంచి నీళ్ళు కారడం మాని, టబుని చూసి చొంగ కార్చడం ఎక్కువయ్యింది. ఇంక సినిమా తీయడంలో ఆ దర్శకుడు ఏం సాధించాడో ఆయనకే తెలియాలి. దీనికి కే. విశ్వనాథ్ సాక్ష్యం, "అద్భుతమైన చిత్రాలు"-అట.

ఆఖరికి సామాన్యుల ఇఞ్గితానికి అర్థమయ్యె విషయాలు కూడా దర్శకులకు అర్థం కావట్లేదు. ఈ సినిమాలకు నంది అవార్డులు, భృంగి అవార్డులు. ఒక్కసారి చిత్తూరు నాగయ్యగారు వచ్చి మళ్ళీ సినిమా తీయాలనిపిస్తుంది నాకు. ఆయన సినిమా కోసమే జీవించిన మహాశయుడు. కథలో భావాన్ని కళ్ళకద్దినట్టు చూపించగలిగిన మహానుభావుడు. వీళ్ళందరూ ఆయన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి.

Anonymous said...

chaala manchi vyaasam raasarandi... okappati cinemalu chusthe indulonchi edo nerchukovachu anipinchedi... ippudu cinema okasari chudatanike laksha sarlu aalochinchalsi vastondi..

Unknown said...

మీ ఆవేదన సహేతుకం. మన పిల్లలకి మన సంస్కృతీ సాహిత్యాలతో విశేషంగా పరిచయం ఏర్పఱచాలంటే దానికి మనం ఏవిధంగా కృషి చెయ్యాల్సుంటుందో ఆలోచించండి. మన వంతు ప్రయత్నం మనం చేయాలిగా. నా మటుకు నేను నా బ్లాగులద్వారా అటువంటి ప్రయత్నం నా చేతనైనంతమటుకు చేస్తున్నాను. ఇంకా నేను చేయగలిగిన దేమైనా ఉంటే తెలియజేయ గలరు.

Sandeep P said...

బాలకృష్ణమూర్తిగారు,

మీరు చెయ్యాల్సింది సక్రమంగానే చేస్తున్నారు. ఇక మా బోటి యువకుల పని ఏమిటయ్యా అంటే ఈ అపారఙ్ఞాననిధిని పదిమందికీ చూపించడం. మీరు మీ సృతిలో కొనసాగితే మేము మీ వెంట తప్పక వస్తాము!

సందీప్

కమల్ said...

పక్కింటిఅబ్బాయిగారు, మీ వేదన అర్థమయ్యింది..! నాదొక అనుమానము..! మీరు ఇన్‌డైరెక్ట్ గా అన్న కూడ యన్.టి.ఆర్ నిర్మించిన " దానవీరశూరకర్ణ " సినిమా గురించే అని అర్థమవుతూఉన్నది..! ఆ సినిమా విడదల అయింది ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో..1978 లో అనుకుంటాను, అప్పటికి ఇంకా ఇప్పటిలాగ గ్లోబలైజేషన్ వలన ఆంగ్ల మాధ్యమాలు వచ్చి, మన సంస్కృతి, ఆచారాలు.. అసలు మహాభారతాలు..రామాయణాలు గురించి తెలియని రోజులూ కాదు, ఇక విషయపరిఙ్ఞానం లేకపోవడం అంటూ ఏమి లేదు..! అప్పటికీ ఇంకా మహాభారతాలమీద పల్లె ప్రజల్లొ చాలా అవగాహన ఉండేది..గ్రామాలలో రాగాలు తీస్తూ పద్యాలు పాడే మయసభలు, ఏకపాత్రాభినయాలు ఉండడం వలన ప్రజల్లో మంచి అవగాహన ఉండేది..మరి అలాంటీ కాలం లో వచ్చిన చిత్రం " దానవీరశూరకర్ణ ", మరన్ని తప్పులున్న సినిమా అయినా ఎంతోమంది మేధావులు, పండితులు అందరు చూసారు.. కాని అందరు ఆ సినిమాని తప్పుపట్టకుండా ఎందుకు సూపర్ హిట్ చేసారో..ఒక సారి విశ్లేషించగలరా.దయచేసి..? యన్.టి.ఆర్ ఏమి అల్లాటప్ప మనిషి కారు..శ్రీవిశ్వనాధసత్యనారాయణగారి శిష్యులు..మరెందుకు ఆయన అలాంటి ప్రయోగం చేసారంటారు..?

Sandeep P said...

@కమల్

స్వర్గీయ NTR విశ్వనాథ సత్యనారాయణగారి శిష్యుడా? ఇదెప్పుడూ వినలేదండీ?

Anil Dasari said...

విజయవాడ SRR కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుకునేటప్పుడు - NTR విశ్వనాధ వారి శిష్యుడు. రామారావు గురించి తెలిసినోళ్లందరికీ సాధారణంగా తెలిసే విషయమే ఇది.

ఇకపోతే, 'దాన వీర శూర కర్ణ' మాటలు రాసిన కొండవీటి వెంకట కవి అల్లాటప్పా సినీ రచయిత కాడు.

Sandeep P said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

హ హ హ

Sandeep P said...

కొండవీటి వేంకట కవి నాస్తికుడని చదివాను.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఒకవేళ నిజమైతే, ఆ సంభాషణలలో ఆయన నాస్తికతను కలిపే అవకాశం లేకపోలేదు అని అభిప్రాయం.

కమల్ said...

@సందీప్.
స్వర్గీయ యన్.టి.ఆర్ కేవలం విశ్వనాధసత్యనారాయణ శిష్యుడే కారు..ఆయనకు నాటకం లో మొట్టమొదటి ఒ న మాలు దిద్దింది కూడ విశ్వనాధులు వారే." నాయకురాల నాగమ్మ " నాటకం విశ్వనాధ వారి దర్శకత్వం లో యన్.టి.ఆర్ మొట్ట మొదటిసారిగా మొహానికి రంగులేసుకున్నారు..!

ఇక మీరు వెలబుచ్చిన కొండవీటివెంకట కవి నాస్తక విషయం..! ఎవరికీ ఆ విషయం మీద నిజనిజాలు తెలియవు..అసలు ఆదారాలు కూడ లేవు..బహుశ బ్లాగ్ లోకంలొ ఈ నాస్తిక..ఆస్తిక వాదల మీద గొడవలు...అభిప్రాయభేదాల నేపధ్యంలో ఉద్భవించిన మాటలులాగే అనిపిస్తున్నది..! ఏది ఆధారం దొరక్కపోతే ఏదో ఒక " అభిప్రాయానికి" వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఆరోపణలు వస్తాయేమో అనిపిస్తున్నది.

Seetharam said...

విషయం దారి తప్పకుండా నాదో మనవి.

దుష్టజన సాంగత్యము వల్ల కర్ణుడు చెడినాడు. మరో చోట చదివిన విషయం ఏమిటంటే, కర్ణుడు, పూర్వ జన్మ లో కాలనేమి (చదివి చాలా రోజులవడం చేత పేరులో చిన్న అనుమానం ఉంది). కాలనేమి కి వంద సహజ కవచాలు ఉన్నాయి. సహజ కుండలాలు ఉన్నాయి. వాడు నర నారాయణుల తో యుద్ధానికి తలపడినప్పుడు, వీరిరువురూ ఎన్నాళ్ళకీ వాడిని గెలవ లేక పోయినారు. అప్పుడు, నారాయణుడి సలహా తో ఒకరు తపస్సు చేస్తుంటే, ఒకరు యుద్ధము చేసి, అలా తొంభై తొమ్మిది కవచాలు ఊడ గొట్టేరు. మిగిలిన ఒక్క కవచమూ కూడా పోతే తన మృత్యువు నిశ్చయము అని తెలుసుకున్న కాలనేమి పారిపోయాడు. పోయి కర్ణుడి గా పుట్టేడు. వాడిని చంపడానికి నర నారాయణులు ఉద్భవించి నశింప చేశారు.

అలాగే, రావణుడు కైలాసానికి వెళ్ళినప్పుడు, నంది వానర ముఖం తో కనపడ్డాడు. ఆ రూపాన్ని అపహసించినందుకు నంది, వానర సమూహముతో నే నీ నాశనము అని శపించాడు. రంభను కుక్కుట వృత్తిలో అనుభవించిన పాపానికి, రంభ ప్రియుడైన నలకూబరుడు, రావణుని, అనిష్ట స్త్రీ ని తాకిన మరుక్షణమే మరణము అని శపించాడు. అటు తరువాత రావణుడు అనిష్ట స్త్రీలను తాక లేదు. అంతే కాక రావణుడు చెయ్యని నీచ కార్యము లేదు. నారాయణ దూషణ, యజ్ఞ యాగ తిరస్కరణ, ఇంకా ఎన్నో..

వీరిరువురూ ఆయా దుర్బుద్ధుల వల్ల నశించారు. మన (హిందూ) ధర్మం ప్రకారం, ఎవరు ఎలా వాగినా (తీవ్రతకు క్షమాపణలు), వారి పాపాన వారే పోతారు అని ఊరుకుంటాం. లేకపోతే, విష వృక్షం ఎందుకు భరిస్తాం? సినిమాలో విషయాలు నిజాలు కావు, కనక వాటిని నమ్మకూడదు, అవి (ముఖ్యముగా ఈ నాటివి ) విమర్శనానర్హములు

సీతారామం

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

వరుణుడు గారికీ,అనామకుల వారికీ,నరసిమ్హ గారికీ,కత్తి మహేష్ గారికీ,సీతారాం గారికీ,
కృతఙ్ఞతలు
కమల్ గారికి,
డెబ్భయ్యొవ దశకం మనం ఊహిస్తున్నంత గొప్పదేమీ కాదు నాటకాలకు పాడెగడుతూ రికార్డింగ్ డాన్సులు మొదలవుతున్న సమయం అది.మేధావులు ఎందుకు ఊరుకున్నారన్నారు "మేధావుల మౌనం కుహనా మేధావుల గానమే ఇంతదాకా తెచ్చింది"
ఎన్ టీ ఆర్ అలా చెయ్యడం పెద్ద విచిత్రమేం కాదు ఆయన చెయ్యి చేసుకున్న ప్రతీ పౌరాణికం దాదాపు అలానే ఉంటుంది(బ్రహ్మర్షి విశ్వామిత్ర మరో ఉదాహరణ).దీనికి కారణాలు కావాలంటే మనం ముసుగులో గుద్దులాట వదిలి కృష్ణా గుంటూరుల్లో అదే సమయంలో తల ఎత్తిన కమ్మ వారి బ్రాహ్మణ వ్యతిరోకోద్యమం,ఆపై ఆయనే చేసిన కరణం వ్యవస్థ నిర్మూలన గమనిస్తే దొరుకుతాయి.విశ్వనాథ వారి శిష్యరికం అంటారా అది ఆయనకు పౌరాణిక ఙ్ఞానాన్ని ఇచ్చి ఉంటుంది కానీ సనాతన దృక్పథాన్ని అందించి ఉంటుందనుకోను.
ఐనా పాపం ఈ చారిత్రిక పరిణామంలో ఎన్ టీ ఆర్ తన పాత్ర నిర్వహించారు అంతే దానికి ఆయన్ని తప్పుపట్టి లాభం లేదు.పై సాంఘిక పరిణామాలు ఆయన్ను అలాంటి సినిమాల వైపుకు తోసాయి.అందుకే ఆయన్ని విమర్శించలేదు తప్ప పరోక్ష విమర్శలు చేద్దామని కాదు.
అబ్రక దబ్రా గారికి,
కొండవీటి వేంకట కవి అల్లాటప్పవాడో కాదో నాకు తెలియదు గానీ...మహాభారతం రాసిన వేద వ్యాసుల వారికి తెలియనివి కనీసం జైమిని మొదలైన భారతాల్లో లేనివి ఈయనకు ఎలా తెలిసిపోయాయా అని నా ఆశ్చర్యం.మూలానికి కనీసం విలువ ఇవ్వకుండా గీకి పారేసారే జనాల గొర్రెదాటుతనం మీద వీళ్లకు ఎంత నమ్మకమో అని ఆశ్చర్యం.
--సంతోష్ సూరంపూడి

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

సందీప్ గారికి,
కర్ణుడి గొప్పదనం విషయంలో మీరు చెప్పిన విషయంపై నాకు ఏ ఆక్షేపణా లేదు.కానీ ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామను మొదటినుంచీ భారతంలో ప్రతీ పాత్రా మహానుభావునిగా గుర్తిస్తూంటుంది.కానీ ఎప్పుడైతే విప్రుడై ఉండీ రాత్రివేళల్లో నిప్పుపెట్టి బాలకుల్ని చంపాడో అప్పటితో అతని ఘనతలకు చెల్లు చేసి పిశాచ వర్తనుడని చరిత్ర హీనుడిగా గుర్తిస్తుంది భారతం .అది భారత స్ఫూర్తి కర్ణుడికీ ఈ విషయంలో మినహాయింపు లేదు. మహాదాత అయినా ధర్మ వర్తనం వదిలిన నీచుడు కర్ణుడు.అదీ భారతీయ దృక్పథం.
---సంతోష్ సూరంపూడి

కమల్ said...

పక్కింటి అబ్బాయి గారికి..!
మీరు డెబ్బయ్యోవ దశకం మనం ఊహిస్తున్నంత గొప్పదేమికాదన్నారు..! ఆ డెబ్బయ్యోవ దశకంలో నేను స్కూల్ పిల్లవాడిని..! డి.వి.ఎస్. కర్ణ సినిమావిడుదల కూడ చూసాను, ఆ కాలంలో నేను మయసభ, గయోపాఖ్యానం, రాయభారాల నాటకాలు కూడ చూసాను. మీరన్నట్లు రికార్డింగ్ డాన్సుల పరిస్థితికి..నాటకాల పరిస్థితికి..సంబందం లేదు..వేటి దారి వాటిదే..! ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర తీసినకాలంలో యన్.టి.ఆర్ ప్రతిపక్షంలో ఉండడం వలన రాజీవ్ గాంధి ..ఇంకా కాంగ్రెస్స్‌ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సీన్స్ ఉన్నాయి అవన్ని ఆక్షేపించే విషయాలే, అంతే కాని దానికి కులరంగు ఏమి లేదు...! ఇక ముసుగులో గుద్దులాట విషయంలోబ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం బహుశ అవన్ని కోస్తాప్రాంతమైనా కృష్ణా, గుంటూర్ లలో జరిగొండచ్చేమో..? నాకా విషయం మీద అవగాహన లేదు..! నేనా ప్రాంతం వాడినికాను కావున..! కాకపోతే కరణాల వ్యవస్థ రద్దు చేయడానికి మీరు చెప్పిన కారణం అయితే కాదు..! అప్పటికే గ్రామాలలో కొన్ని సంవత్సరాలుగా కరణాలు, రెడ్డి వ్యవస్థ గ్రామాల ఆర్థిక పరిస్థితిని, సమాజాన్ని తమ గుత్తాధిపత్యంగా చేసుకోవడం అదే సమయంలొ తెలంగాణలో " నీ కాల్ ముక్తా " అన్న చందాన అవి చాలా దారుణంగా ఉండడం మూలాన, తన కూడ ఒక రైతు కుటుంబం నుండి వచ్చినవారే..ఇవన్ని ఆయన మీద ప్రభావం చూపాయి..! బహుశ మిమ్మల్ని మీ పెద్దలు మీకు అలాంటి అభిప్రాయాలు కలిగే విదంగా పెంచినట్లున్నారు..! ఇక బ్రాహ్మణ వ్యతిరేకం మీద నేను కొంతమంది యన్.టి.ఆర్ సినిజీవితంతో ప్రయాణం చేసిన ఒకరిద్దరి బ్రాహ్మణ నటుల ఇంటర్‌వ్యూ ద్వార కొన్ని విషయాలు తెలుసుకొన్నా..! " ఎవరండి..? ఎవరికి తెలుసండి ..? యన్.టి.ఆర్ బ్రాహ్మణ వ్యతిరేకి అని ఎలా చెబుతున్నారు..నేను స్వయంగా చూసిన వాడిని.." అంటూ చాలా విషయాలే చెప్పారు, కావాలంటే మీకు ఆ నటుల ఫోన్ నంబర్ ఇస్తాను..వెల్లి మాట్లాడండి..! ఆయన ఎవరో కాదు.." లవకుశ " సినిమాలో లవుడు పాత్రదారి అయిన శ్రీ నాగరాజు గారు..! ఆయన తండ్రి చిన్న వయసులోనే చనిపోతే యన్.టి.ఆర్ వద్దే ఆయన ఇంట్లోనే ఉన్నారట చాలా రోజుల వరకు..! నేనేమి యన్.టి.ఆర్ ని సమర్థంచడానికి ఇవి చెప్పట్లేదు..ఇలాంటివి యన్.టి.ఆర్ మీద చాలా ఆరోపణలున్నాయి.., వాటి నిజనిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడ. కాకపోతే నాకు పౌరాణాకాల మీద మీకున్నంత పట్టు, అవగాహన లేదు.. సొ ఇక ముందు ఇవి కూడ నేను నివృత్తి చేసుకోవాలి..యన్.టి.ఆర్ ఎందుకిలాచేసారని..? ఇక యన్.టి.ఆర్ సినిమాలు రాకమునుపే ప్రజల్లో కొన్ని అభిప్రాయాలుండేవి..నా చిన్నవయసులో నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎప్పుడు వింటూనే ఉండేవాడిని, పాండవుల పక్కనున్న శ్రీకృష్ణుడు వలన పాండవులు మనుగడ సాగించారని.. కావాలనే అర్జునుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఒక పథకం ప్రకారమే కర్ణుడికి శాపాలు కలిగేలా చేసారని..దాని వలనే కర్ణుడు దెబ్బతిన్నాడు కాని అర్జనుడుకన్న కర్ణుడే ఒకరకంగా మంచోడు అన్న అభిప్రాయాలుండేవి, అవన్ని గ్రామలలో ఉన్న ప్రతి దేవాలయాల్లో ప్రతివారం జరిగే రామాయణ పారాయాణం లేక మహాభారత పారాయణం వలన విని ఎవరికి వారు అనుకున్న అభిప్రాయాలు..!అలాంటి సాంప్రాదాయాలు టి.వి. సినిమాలు...అంతర్జాలాల వలన ప్రస్తుత సమాజంలో లేవులేండి...! పౌరాణాకాల మీద కుప్పలుతెప్పలుగా కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి..! ఇది ఇంతే... ఇంతకన్న ఇక ఏమి లేదు అని ఎక్కడ ఎవరు ఒక నిర్దిష్టమైన "అంతం" చెప్పట్లేదు.., రోజురోజుకి..ఎవరో ఒకరు.ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉన్నారు..! వాటికి ప్రామాణికాలు ఏమిటో కూడ ఎవరు చెప్పట్లేదు..! అంతా సగం సగం విద్యగానే మిగిలిపోతున్నది.

Anil Dasari said...

@పక్కింటబ్బాయి:

>> "కొండవీటి వేంకట కవి అల్లాటప్పవాడో కాదో నాకు తెలియదు గానీ...మహాభారతం రాసిన వేద వ్యాసుల వారికి తెలియనివి కనీసం జైమిని మొదలైన భారతాల్లో లేనివి ఈయనకు ఎలా తెలిసిపోయాయా అని"

ఏముందీ .. గుంటూరు జిల్లాలో కమ్మవారి బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం గురించి మరెవరికీ తెలీని విషయాలు మీకు తెలిసినట్లే ;-)

ఎన్టీయార్ చేసింది ఆయా పురాణ పాత్రల మరో కోణాన్ని పరిచయం చెయ్యటం. అన్ని డజన్ల పౌరాణిక సినిమాల్లో నటించిన రామారావు ఇలాంటి ప్రయత్నం చేసింది ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే. దానికే ఆయనేదో రహస్య అజెండాతో కుట్రలు చేసినట్లు వ్యాఖ్యానించటం సరికాదు. కర్ణ, దుర్యోధనుల దృక్కోణంలో కథ సాగితే పాండవులు ప్రతినాయకులుగా కనిపించక మరెలా కనిపిస్తారు?

రామారావు సినిమాల వల్ల హిందూ మతానికేదో నష్టం కలిగిపోయిందనుకుంటే అమాయకత్వమే. పదో క్లాసు ప్రేమలు, పెళ్లికి ముందే అనుభవాలు, పబ్ కల్చర్లు .. ఇలాంటీ విచ్చలవిడి పనులకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రోత్సాహమిస్తున్న ప్రస్తుత కాలపు సినిమాల వల్ల కలిగే నష్టంతో పోలిస్తే, 'దాన వీర శూర కర్ణ' హిందూ మతానికి చేసిన చేటేమీ లేదు. ఉంటే గింటే, అది మహాభారతమ్మీద మరింతమందికి ఆసక్తినే కలిగించింది.

Anil Dasari said...

Btw - డీవీఎస్ కర్ణ మీద మాత్రమే నా అభిప్రాయం అది. అన్ని తెలుగు పౌరాణిక సినిమాలకూ - ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో వచ్చిన, వస్తున్న వాటికి అది వర్తించదు. వీటి నిర్మాణం వెనక కుట్ర కోణాలున్నాయని నేన్నమ్మను కానీ, మితిమించిన వ్యాపార కోణాలతో చరిత్రనీ, పురాణాల్నీ అడ్డగోలుగా వక్రీకరిస్తున్నారని నమ్ముతాను. వాటి గురించి అప్పుడెప్పుడో ఓ వ్యంగ్య టపా కూడా రాశాను. చూడుడు: శ్రీ ఏసుక్రీస్తుడు

Kathi Mahesh Kumar said...

ఎవరో చెప్పగా మీరు విన్నకథ మాత్రమే సరైన "కోణం" అని అనేసుకుని ఎవరు మరే ఇతర కోణంలో interpret చేసినా అది కుట్ర అనుకుంటే ఎట్లా? నిజంగా వ్యాసుడు ఏంరాశాడో ఎవరికీ తెలీదు. వాల్నీకి రాశాడంటున్నదాంట్లో ఎంత నిజంగా వాల్మీకి రాశాడో అసలు తెలీదు. మరి ఎందుకీ విశ్లేషణ? మీకు రామారావు కోణం నచ్చలేదు. అంతవరకూ బాగానే ఉంది.

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

కమల్ గారికీ అబ్రకదబ్ర గారికీ కత్తి మహేష్ గారికీ,
ఇక్కడ విషయం నా వ్యాఖ్య వల్ల పక్కదారి పట్టి చర్చ వేరే విషయాలపైకి పోతోంది.సరే ఎన్ టీ ఆర్ ని విమర్శించడం(పోనీ సమర్ధించడం) నా టపా లక్ష్యం కాదు కనుక కరణం వ్యవస్థ గురించి మీ మాటకు మాట తగిలించను.
ఇక సినిమాలు అంటారా ఎన్ టీ ఆర్ చెయ్యి చేసుకున్నవి అన్నాను.దర్శకత్వం గానీ నిర్మాణం గానీ నెరపిన సినిమాలు సీతారామ కళ్యాణం,దాన వీర శూర కర్ణ,బ్రహ్మర్షి విశ్వామిత్ర ఇలా అన్ని సినిమాలూ అలానే ఉంటాయి.దాని వెనుక కుట్రే ఉండనక్కర్లేదు అందుకే అలా ఎందుకు ఆలోచిస్తున్నారనేది ఆలోచించాల్సిన విషయం అన్నను.కానీ కామెంట్లో ఎందుకు అంటూ రెట్టించడం వల్ల కొన్ని ఊహలు అభిప్రాయాలు చెప్పాను.నేనేమీ అభిప్రాయాలు సినిమాలుగా తీయలేదు లెండి.
పోనీ ఆయన సినిమా ఆయనది అనుకుంటే"స్థూల కథను మాత్రమే తీసుకుని పాత్రలస్వభావాన్ని సంఘటనలనూ మార్చాం" అని ఐనా టైటిల్స్ లో వేసి ఉండాలి.ఈనాటి రచయితల రచనలు ఇలా చేస్తే అలా ఇస్తారు కదా.
---సంతోష్ సూరంపూడి.

కొత్త పాళీ said...

మీరు ఎప్పుడో రాసిన టపా, దానికి రసవత్తరమైన ఈ చర్చా ఇప్పుడే నా కళ్ళబడింది, దేనికోసమో జాలంలో వెదుకుతుంటే. చాలా బావుంది. ఆలోచించాల్సిన విషయాలు.
మన తోటి బ్లాఅరి కస్తూరి మురళీకృష్ణగారు రాసిన నవల అసిధార చదివారా? లేకుంటే చదవండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.

Omli Tech said...

guru gaaru...
meeru cheppina vaati paina gnanam ee cinima vaariki untae atuvanti dialogues raayaru...

kaani meeru enno teliyani vishayalu teliyajesinanduku dhanyavaadamulu...: